రూ.17 కోట్లతో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్
Health Minister Satyakumar yadav
గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, అన్ని మౌలిక వసతులతో సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం గజపతినగరం ఏరియా ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ, 2019లో మంజూరైన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.17 కోట్ల వ్యయంతో పనులను పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తిచేసినట్లు మంత్రి పేర్కొన్నారు.ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా పెరిగినట్లు మంత్రి వివరించారు. 2023–24 సంవత్సరంలో లక్షా 45 వేల ల్యాబ్ పరీక్షలు జరగగా, 2024–25లో అవి లక్షా 75 వేల వరకు పెరిగాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే ల్యాబ్ టెస్టులు మూడు లక్షల 20 వేల వరకు పెరగడం డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది సేవాభావానికి నిదర్శనమని అన్నారు. ఇంతటి వేగవంతమైన వృద్ధిని తాను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని మంత్రి పేర్కొన్నారు.

డాక్టర్ల సంఖ్య 31 నుంచి 98కి పెరిగిందని, గతంలో 8 స్పెషాలిటీలే ఉండగా ప్రస్తుతం 15 స్పెషాలిటీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏరియా హాస్పిటల్‌లో లాప్రోస్కోపిక్ సర్జరీ సౌకర్యం కల్పించడం గర్వకారణమని అన్నారు. అవసరమైన వైద్య పరికరాల మంజూరుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని స్పష్టం చేశారు.ప్రజలకు సేవలందించే సమయంలో డాక్టర్లు, సిబ్బంది ఓపికతో విని, అవసరమైన పరీక్షలు, మందులు మాత్రమే సూచించి, రోగులు ఆసుపత్రి నుంచి సంతృప్తితో వెళ్లేలా వైద్య సేవలు ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే ప్రజల అంచనాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలన్నారు.ఎన్‌క్యూఏఎస్ (NQAS) సర్టిఫికేషన్ పొందేందుకు అవసరమైన ఫైర్ అలారమ్ సిస్టమ్, ఇతర మౌలిక వసతుల కోసం తక్షణమే నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. హెల్త్ సెక్రటరీ సమన్వయంతో అవసరమైన నిధులను వెంటనే శాంక్షన్ చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ,రాష్ట్ర సెకండరీ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కెవిఎస్ చక్రధర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీవన రాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి, ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ జగదీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ పివివి గోపాల్ రాజు, సర్పంచ్ ఎన్ కొండమ్మ , పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
