యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి-కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Collector S.Ramsuder reddy
యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.విజయనగరం జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం, వాటిని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ర్యాంప్’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనపై యువతకి పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఎంటర్ ప్రేన్యూయర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (EDP)లో భాగంగా, నియోజకవర్గ ప్రత్యేక అధికారుల సహకారంతో శిక్షణా కార్యక్రమాలను మార్చి లోగా పూర్తి చేయాలని చెప్పారు. ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన ఉద్యమ్, ఆర్బీఎసెంస్, యుఆర్ఏడబ్ల్యు, విడిపి, జెడ్ఈడి, ఎంజీపీ, బీడీఎస్, టిఆర్డిఎస్, ఐపీఆర్ తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమాలను నిర్వహించని వెండార్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారి కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన ర్యాంప్ పథకం ద్వారా ఎంఎస్ఎం(MSME)ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన నేపథ్యంలో, జిల్లాలో దీనిని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద రూపొందించిన ‘వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక’ ద్వారా పరిశ్రమలకు అవసరమైన సంస్థాగత మద్దతు, మార్కెట్ సౌకర్యాలు,సులభతరంగా రుణాలు అందజేయడం వంటి పనులపై దృష్టి సారించాలని వివరించారు.
ముఖ్యంగా ఎంఎస్ఎం (MSME)ఈలకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం మరియు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మెరుగుపరచడం వంటి అంశాలలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా అధికారులు, అమలు చేసే సంస్థలు మరియు భాగస్వామ్య పక్షాలు నిర్ణీత గడువులోగా నిర్దేశిత ఫలితాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం కరుణాకర్, ఎపిసిఐఐసి జెడ్ఎం మురళీమోహన్, సిపివో పి.బాలాజీ, జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, ఎల్డిఎం నారాయణమూర్తి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
