పూర్వోదయ పథకం ద్వారా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Minister Kondapalli Srinivas review of irrigation projects
పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ పథకం కింద సుమారు రూ.1300 కోట్లతో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికను తయారు చేసినట్లు వెల్లడించారు.జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి వనరులపై కలెక్టరేట్లో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. తోటపల్లి, తారకరామ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, గడిగెడ్డ, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల అభివృద్ధి, మరమ్మతులు, కాలువల్లో పూడిక తీత, భూ సేకరణ, పునరావాసం తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి అంశాలపై చర్చించారు. ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు. పూర్తి చేయడానికి కావాల్సిన వనరుల సమీకరణ, పనులపై చర్చించారు. ప్రాజెక్టుల పరిస్థితులను, తీసుకోవాల్సిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి వివరించారు. త్వరలో భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, కోళ్ల లలిత కుమారి, పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ, సాగునీటి వనరులకు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను ప్రస్తావించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వదయ పథకం ద్వారా రూ.1300 కోట్లతో తోటపల్లి, తారకరామా ప్రాజెక్టుల పెండింగ్ పనులు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, గడిగెడ్డ – చంపావతి అనుసంధాన పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 58వేల ఎకరాలకు నీరు అందుతుందని, మిగిలిన భూములకు సాగునీరు అందించేందుకు పనులను పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని, ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ 18 నెలల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో సుమారు 8 వేల చెరువులు ఉన్నాయని, వీటన్నిటిని మరమ్మతులు చేయడం ద్వారా దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద పూర్తి పారదర్శకంగా సుమారు రూ.600 కోట్ల రూపాయలతో కన్వర్జెన్సీ పనులను చేపట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు కృషి చేశామన్నారు. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మందికి భాగస్వామి పింఛన్లను మంజూరు చేశామని, కొత్త పింఛలను త్వరలో అందించేందుకు కార్యాచరణను రూపొందించామని తెలిపారు. ఒక్క అర్హత లేని దివ్యాంగులకు తప్ప, తమ ప్రభుత్వ హయంలా ఏ ఒక్కరికి పింఛను తొలగించలేదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎం ఎస్ ఎం ఈ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గుర్ల స్టీల్ పరిశ్రమ, బొబ్బిలిలో మరో కొత్త పరిశ్రమ త్వరలో ఏర్పాటు కానున్నాయని మంత్రి తెలిపారు.

మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 90 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రాజెక్టులన్ని కనీసం మరమ్మతులకు కూడా నోచుకోకుండా, పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. వాటిని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సహాయశక్తిలా కృషి చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో డిఆర్ఓ మురళి, చీఫ్ ఇంజనీర్ కేవిఎన్ స్వర్ణకుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి.అప్పలనాయుడు, పి. సుధాకర్ రావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు హెచ్ మన్మధరావు, వై గన్నిరాజు, పి.అప్పలనాయుడు, ఎం వెంకటరమణ, డిఎస్ ప్రదీప్, బి గోవిందరావు, ఏ ఉమేష్ కుమార్ పలువురు డిఈలు తదితరులు పాల్గొన్నారు.
